Saturday, August 14, 2010

కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


మళ్లీ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు పణంగా పెట్టిన యోధులని స్మరించుకునే రోజు వచ్చింది.
మొక్కుబడిగా "వేడుకలు" జరుపుకుని
టీవీ లో సినిమాలు చూస్తూ కొందరు,
మందు కొడుతూ కొందరు,
నిద్ర పోతూ కొందరు గడిపే రోజు వచ్చింది.



నిన్న రాత్రి 11 గంటలకు పంజాగుట్ట సెంటర్ లో జోరున వర్షంలో
ఒక చిన్న కుర్రాడు జాతీయ జెండాలు అమ్ముకుంటు కనిపించాడు
మన దేశం సాధించిన "అభివృద్ది" కళ్ళ ముందు కనిపించింది.
కొద్ది రూపాయల కోసం, జోరున వర్షంలో పసివాళ్ళు అవస్థ పడడం
మన 64 ఏళ్ళ స్వరాజ్య పాలన ఫలం.
దీనికి కారకులయిన మన నాయకులకు మరొక్క సారి
వందనం చేద్దాం.


మహాకవి శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి

"స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరబాటోయి

కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి".



ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు..
మనమే మన దేశానికీ పూర్వ వైభవం తెద్దాం..
చేతనైనంత మంచి చేద్దాం ..


జై హింద్

Sunday, August 8, 2010

తెగులు తవిక - తెలుగు కవిత

శ్రీ కృష్ణ దేవ రాయలు పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక కవిత రాయాలని అనుకున్నా !
(Courtesy : ఈ రోజు ప్రసారమైన దూరదర్శన్ వారి కవి సమ్మేళనం)
 
కాని ఆ ప్రయత్నం బెడిసికొట్టి ఒక తవిక గా మారింది.
తప్పక చదవండి ...

తెలుగు కవిత : (Please read like Sri C Narayana Reddy)

కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలి
కంద పద్యం రాయాలి ..వందల మంది చదవాలి ..
ఛందస్సు తెలియదు .. నా బొంద తెలియదు ... అయినా
కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలి
ఉత్పలమాల లో ఉప్పొంగి పోయేలా ..
కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలి

చంపకమాల లో చమక్కులు
మత్తేభంలో మ్యాజిక్కులు
హా అనిపించే హైకులు
అన్నీ కలగలిపి కవితా గోష్టి లో కలేజా చూపాలి 


అహో ఆంధ్ర భోజా శ్రీ కృష్ణ దేవ రాయా ..!
నీవల్ల నాకు inspiration కలిగిందయా !!

Thursday, August 5, 2010

చట్టాలకు చుట్టాలు - మన ప్రియతమ నాయకులు


నా ఇష్టం .. ఎవరేమనుకంటె నాకేంటీ అనుకుని బహిరంగంగా పొగ త్రాగేవాళ్ళు మన దేశంలో కోకొల్లలు.బహిరంగ థూమపానం నిషేధించారని చాలామందికి ఇప్పటికీ తెలియదు. తెలిసినా అలవాటు మానుకోలేక ఎలాగోలా చాటుగా దమ్ము లాగిస్తున్న వాళ్ళు ఉన్నారు.

ఇవన్నీ నాణానికి ఒక వైపు. మరొక వైపు మన నాయకులు....... చట్టాలను తయారు చేసే వారు అదే చట్టాలను ఎలా గాలికి వదులుతున్నారొ ఈ వార్త చదివితే అర్ధమవుతుంది. (ఈ రోజు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక లో ప్రచురితం అయింది.)  

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఫొటొలో కనిపించిన ప్రజా ప్రతినిధి, తమ కార్యాలయంలో ఇలాంటి విషయాలను అనుమతించిన ప్రధానోపాధ్యాయులు కూడా శిక్షార్హులు. కాని ఎప్పటిలాగే ఎవరూ పట్టించుకోరు. అసలు ఇదీ ఒక పెద్ద విషయమేనా అనుకునేవాళ్ళు ఉండొచ్చు.

నాయకులకే చట్టాల పట్టింపు లేనప్పుడు మనకేం పట్టింది అనుకుంటాడు సామన్యుడు.. ఇక మన సమాజం బాగుపడేదెప్పుడో?


Anti smoking slogan by Ministry of Health and Family Welfare, Govt of India

Thursday, July 29, 2010

ఆంద్ర రాష్ట్రం పై శ్రీ శ్రీ కవిత



ఆంద్ర రాష్ట్రం  
రాలడానికి పండు కాదు
పండడానికి కాయ కాదు 
కాయడానికి పువ్వు కాదు 
పూయడానికి మొగ్గ కాదు
మొగ్గడానికి తేలు కాదు 
తేలడానికి పాము కాదు 
పామడానికి కాలు కాదు 
కాలడానికి ఖర్మ కాదు 


- శ్రీ శ్రీ

ఈ కవిత ఏ సందర్భంలో ఎందుకు చెప్పవలసి వచ్చింది ?
ఇందులో కవి హృదయం ఏమిటి తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది.
తెలిసిన వాళ్ళెవరైనా చెప్పండి ప్లీజ్.

Tuesday, March 30, 2010

నల్ల డబ్బు తెచ్చే ముప్పు ఇంతింత కాదయా

 The Evils of Black Money on the Society :


ముందు ధియరీ కొంచెం చదవండి : 
 
నల్ల డబ్బు అంటే  అక్రమంగా సంపాదించిన డబ్బు అని చిన్న పిల్లాడికి సైతం అవగాహన ఉంది.కాని సరైన నిర్వచనం చెప్పాలంటే, ఆదాయపు / ఇతర పన్నులు కట్టని డబ్బు అని అర్ధం. మన దేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు లెక్క కట్టడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. గత కొన్ని దశాబ్దాలుగా తర తరాలుగా నల్ల డబ్బు కూడగట్టిన కుటుంబాలు కోకొల్లలు. పన్ను ఎగగొట్టడం ఒక కళగా సాధన చేస్తున్నవారు ప్రభుత్వానికి అంత సులభంగా దొరకరు. మన అధికారులు కూడా  చిన్న చిన్న కానుకలు స్వీకరించి  "పోనీలే పాపం" అని వాళ్ళని వదిలేస్తుంటారు.
 

మామూలు గా అందరూ సక్రమంగా సంపాదించి అక్రమంగా పన్ను ఎగవేస్తుంటారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది.. అభివృద్ది పనులు జరగవు.



అయితే ఈ నల్ల డబ్బు కి మరొక ప్రమాదకరమైన పార్శ్వం ఉంది. అదే చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన ధనం. ఈ రకమైన నల్ల డబ్బుచాలా ప్రమాదకరం. అది దేశ ఆర్ధిక వ్యవస్థనే కాకుండా పాలన వ్యవస్థని కూడా అస్థిర పరుస్తుంది. అంతే కాదు, ఆ డబ్బు మళ్ళీ చీకటి కార్య కలాపాలకు మళ్ళుతుంది. ఆ డబ్బుని నక్సలైట్స్, క్రిమినల్స్, ఇతర సంఘ వ్యతిరేక శక్తులు - తమ ఆయుధాలు సమకూర్చుకోవడానికి వాడే ఆవకాశం ఉంది. ఇంకా, రాజకీయ నాయకులు, వోట్ల కోసం నోట్లు పంచడానికి, కంట్రాక్టర్లు లంచాలు ఇవ్వడానికి వాడటం ఎలాగు ఉంటుంది.

ఇన్ని విధాలుగా మన వ్యవస్థ పై  దుష్ప్రభావం చూపిస్తున్న ఈ మహమ్మారిని ఏమి చేయ్యలేమా? ఆదాయపు పన్ను శాఖ వాళ్లకి, ఇతర ప్రభుత్వ విభాగాలకి దీనిని అరికట్టే శక్తి లేదా - అని ప్రశ్నించుకుంటే ఉందనే జవాబు వస్తుంది. ఎన్నో చట్టాలు, పద్ధతులు      ( procedures ), నిఘా వ్యవస్థలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. అవి సవ్యంగా పని చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది.

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ, మైనింగ్, లీగల్, సివిల్ కాంట్రాక్ట్, ఎక్సైజ్ మొదలైన వ్యవహారాల్లో నల్ల డబ్బు వాటా ఎక్కువ. కొద్దిపాటి జాగ్రత్త వహించి, కొంచెం నిజాయితీ చూపిస్తే, అధికారులు ఇలాంటి పన్ను ఎగవేత దారులని సులభంగా పట్టుకోవచ్చు. పాన్ నంబర్ గాని, మరేదైనా నంబర్ గాని తప్పనిసరిగా ప్రతి లావాదేవీలో వాడాలి అని ఉన్న నిబంధనని తు చ తప్పక పాటించాలి. భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తిగా కంప్యుటరైజ్ చెయ్యాలి. ఇలాంటి విషయాలలో ఎంత పారదర్శకత ఉంటె అంత తక్కువ అవినీతి, పన్ను ఎగవేత ఉంటాయి.

ఇక అసాంఘిక కార్యకలాపాలకు వాడే నల్ల డబ్బు పూర్తిగా భిన్నమైన దారిలో ప్రయాణిస్తుంది. వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాలకు రావడం, తమ వివరాలు ఇవ్వడం అనే సమస్య రాదు. హవాలా లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా లావాదేవీలు నడుస్తాయి. దీనిని అరికట్టడం ఆదాయపు పన్ను అధికారుల వల్ల అయ్యే పని కాదు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, నిజాయితీ కల అధికారులు, అప్రమత్తత ఉన్న పౌరులు ఇందుకు ఉపయోగ పడతారు.

ఇలా దాచిన డబ్బు చివరకు విదేశాల్లో తేలుతుంది, మన ఆర్ధిక వ్యవస్థకు శాపంగా పరిణమించిన ఈ సమస్య కు, ఆ దేశాల ప్రభుత్వాలు, బ్యాంకులతో అవగాహన కు రావడం కూడా అవసరం. కాని ఏ ప్రభుత్వం వచ్చినా తమ ఆస్తులు బయట పడతాయనే భయంతో ఇందుకు చిత్తశుద్ది తో ప్రయత్నించదు. చివరకు కోర్ట్ లు కలగా చేసుకోవాలి ఇందుకు కూడా !!  
ఈ లింక్ చూడండి : 
నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే :
  • మీరు దేశాన్ని ప్రేమించే వాళ్ళయితే  నల్ల డబ్బు పోగు చెయ్యకండి 
  • మనం చెల్లించే ఆదాయపు పన్ను, ఇతర పన్నులు మన అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది అని మరిచిపోవద్దు. 
  • ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థ అనేది నేర మయమైన పునాదుల మీద నిర్మితమైంది - దానిని ప్రోత్సహించ వద్దు. 
  • రిజిస్ట్రేషన్ లాంటి వ్యవహారాలలో కొద్ది పాటి డబ్బు కలిసివస్తుందని అక్రమ పద్ధతులు అవలంబించకండి. లంచాలు ఇవ్వకండి. లంచం ఇవ్వమని ఎవరైనా అడిగితే అధికారులకు వాళ్ళని పట్టివ్వడానికి సహాయం చెయ్యండి. 

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే : 

మేము ఒక్కళ్ళం నిజాయితీ గా ఉంటె, మేమే నష్ట పోతాం, మిగిలిన వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు అని చాలా మంది బాధ పడుతుంటారు. వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో ప్రభుత్వం ఆలోచించాలి. మన నిజాయితీ మనకి చేటు తెస్తోంది అని అనుకునే ప్రజలున్నారంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమే. నిజాయితీ కి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఉన్నాయని, అవినీతి, అక్రమాలకి శిక్ష తప్పదని నిరూపించేలా తగిన చర్యలు తీసుకోవాలి.

ఈమధ్య హైదరాబాద్ మునిసిపాలిటి పరిధిలో ఆస్తి పన్ను కట్టిన వాళ్ళలో ఒకరికి లాటరి తీసి లక్ష రూపాయల బహుమతి నిచ్చారని వచ్చిన వార్త చూసి నేను ఎంతో సంతోషించాను. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఉత్సాహ పరుస్తాయి.

పూర్తి వివరాలకు :

మరొక వైపు, అవినీతి అధికారుల పై ACB అధికారుల దాడి కి కులపు రంగు పులిమి ప్రభుత్వం, ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా కొట్టుకున్న సంఘటన కూడా ఈ వారంలోనే జరిగింది. కులాల ప్రాతిపదిక పైనే అవినీతిని కూడా కొలిచే ఇలాంటి నీచమైన నాయకులు మన మధ్య ఉండగా ఇంక ఏం మంచి పనులు ఆశించగలం?


ముగింపు :  మంచి నాయకత్వం, మంచి ప్రజలు, మంచి వ్యవస్థ కలిస్తేనే అవినీతి రహిత అభివృద్ది సాధ్యం.

Sunday, March 28, 2010

అమితాబ్ చేసిన తప్పేమిటి?

మహారాష్ట్ర లో ఏం జరుగుతోంది ?

 
బిగ్ బి కి జరుగుతున్నఅవమానాలు ఆయనకి కాదు యావత్ జాతికి జరుగుతున్న అవమానాలు గా భావించాలి.


దొంగలతో, అవినీతి పరులతో, ఇతర సంఘ వ్యతిరేక శక్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే రాజకీయ నాయకులు, అమితాబ్ తో ఒకే వేదిక మీద కూర్చోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు ? అమితాబ్ చేసిన తప్పేమిటి?


పైకి గుజరాత్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యడం ఒక కారణం గా ప్రచారం జరుగుతోంది. మరో వైపు సోనియా గాంధి కుటుంబం, బచ్చన్ కుటుంబం మధ్య పెరుగుతున్న అగాధమే కారణం అని మీడియా కోడై కూస్తోంది.
కారణం ఏదైనా కావచ్చు. ఒక పౌరుడిగానైనా అమితాబ్ ను గౌరవించాలి కదా. ఆయనను అంటరాని వ్యక్తి అని డిక్లేర్ చెయ్యడం ఒకటే తక్కువ అన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఎంత వరకు సబబు?

ఇంతలో మరొక న్యూస్, దేశ రాజధాని ఢిల్లీ లో అభిషేక్ పై కూడా ఆంక్షలు విధించినట్టు, ఆయన earth hour సందర్భం గా ఇచ్చిన మెసేజ్ ను ప్రదర్శించకుండా అడ్డుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదొక అంటు వ్యాధిగా వ్యాపించదని ఆశిద్దాం.


గుజరాత్ ప్రభుత్వం, భారత్ లో భాగం కాదా? ఒక పార్టీ , లేదా వర్గానికి చెందిన వారిని ఇలా సాంఘిక వెలి వేయడం  (unless they are banned by the government) సరైన పని కాదు. ఆశ్చర్యకరంగా శివ సేన అధినేత ఇప్పుడు బచ్చన్ ను సమర్ధిస్తున్నారు. కాని అయన పార్టీ వారే అమితాబ్ పై   కత్తి గట్టి కొద్ది రోజులే అయిందని మరిచిపోయారు.


మొత్తం మీద, తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా, ఎంతో disciplined జీవితం గడిపే అమితాబ్
కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావడం చాలా బాధ కలిగిస్తోంది.

Saturday, March 27, 2010

ఏ మాయ చేసావే - fresh air in hot summer

నిజంగా ఈ సినిమాలో ఒక నిజాయితీ కనిపించింది. అంతే కాకుండా మాటల్లో, పాత్రల ప్రవర్తనలో కొత్తదనం, రొటీన్ ప్రేమ కధల్లో కనిపించే నాటకీయత లేకుండా స్మూత్ గా నడిచిపోయింది. ఎక్కడా విసుగు రాకుండా దర్శకుడు సన్నివేశాలు చాలా బాగా కన్సీవ్ చేసాడు.

నాకు నచ్చిన విషయాలు :
1 . కేరళ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడి విసిగించలేదు.
2 . హీరో మలయాళం వాళ్ళని చితగ్గొట్టి హీరోయిన్ ని ఎత్తుకు పోలేదు.
3 . హీరోయిన్ పిచ్చిగా డాన్స్ చెయ్యలేదు
4 . హీరో డైరెక్ట్ చేసిన మొదటి సినిమాకి ఆస్కార్ వచ్చినట్టు చూపించలేదు.
5 . సున్నితంగా హాండిల్ చేసిన క్లైమాక్స్
6 . నాగ చైతన్య డైలాగ్స్ చెప్పిన తీరు

మరొక విషయం కూడా చెప్పాలి. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతమైన విలువలతో ఉంది. Especially cinematography capturing scenic beauty in Kerala and USA and at the same time canning the right moods with right lighting. కళ్ళకి ఎంతో ఆహ్లాదంగా ఉంది ఫోటోగ్రఫీ.


నచ్చని విషయాలు:

1 . కొన్ని డైలాగ్స్ మణిరత్నం సినిమాల్లో " పొడి " మాటల్లా ఉన్నాయి.
2 . హీరోయిన్ కి ఉన్న ప్రాబ్లం ఏమిటి అన్నది ప్రతి ప్రేక్షకుడికీ అర్ధమవ్వక పోవచ్చు. 
    (of course, నాకు కూడా  కొన్ని doubts ఉన్నాయి ). 
3.  నాగ చైతన్య ను కొన్ని సన్నివేశాలలో deglamourised గా చూపించారెందుకో అర్ధం కాదు.

నా దృష్టిలో ఈ సినిమా ఒక landmark గా నిలుస్తుంది ... చాలా కొత్త ప్రయత్నాలకి ఇది ఒక ప్రేరణ గా ఉంటుంది.

ఇప్పుడు సమయం ..