Saturday, September 18, 2010

దారి తప్పిన న్యాయ-వాదం

ప్రతి శనివారం ఆంద్ర జ్యోతి దిన పత్రిక లో ఆదిత్య పేరుతొ కొన్ని వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి.    చదువుతున్నారా?

ఈ రోజు ప్రచురించిన వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. మీరూ చదవండి.

దారి తప్పిన న్యాయ-వాదం
- ఆదిత్య

రాష్ట్రంలో గతవారం రోజులుగా, ముఖ్యంగా గడచిన మూడు రోజులుగా హైకోర్టు ఆవరణలో చోటు చేసుకు న్న సంఘటనలను గమనిస్తే, భవిష్యత్తులో పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో ఊహించుకోవాలంటేనే భయం వేస్తున్నది. ప్రస్తుతం జరిగిన సంఘటనలకు కారణమైన వారు తాత్కాలికంగా ప్రయోజనం పొందుతూ ఉండవచ్చు. కానీ, తాము ఈరోజు నెలకొల్పిన సంస్కృతి, రేపు తమ మెడకు చుట్టుకోబోతున్నదన్న వాస్తవాన్ని వారు గమనంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.


ఉద్యమకారులు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఎవరైనా వాదిస్తే చేయగలిగింది ఏమీ లేదు. కానీ, ఇవ్వాల్టి మన చర్యలను భవిష్యత్తులో ఉద్యమాలు చేసే వాళ్లు ఆదర్శంగా తీసుకుంటే? ఇవ్వాళ ఉద్యమకారులుగా ఉన్న వాళ్లు, రేపు అధికారంలో ఉండవచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అని ఆలోచించుకుని విజ్ఞతతో వ్యవహరించవలసిన బాధ్యత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారిపై కచ్చితంగా ఉంది.


తెలంగాణ సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకుని ఏమి మాట్లాడి నా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం అవివేకమే అవుతుంది. విద్వేషాలు పెంచి పోషించడం ఎవరికైనా సులువే. కానీ, మన పూర్వీకులు నిర్మించిన వ్యవస్థలను, సంప్రదాయాల ను విధ్వంసం చేస్తే, వాటిని పునరుద్ధరించడం అంత తేలికైన విషయం కాదు. ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టడం ఎవరైనా చేయగలరు. కానీ, ఆవేశాలకు దూరంగా, ఆలోచనతో వ్యవహరించేలా ప్రజలకు నాయకత్వం వహించే వాళ్లే నిజమైన నాయకులు గా మిగులుతారు.


అయితే, జరుగుతున్న పరిణామాలు అందు కు భిన్నంగా ఉంటున్నాయి. ఎరువుల కొరత సమస్యపై ధర్నా చేయడానికి మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడి చేయడం, కరీంనగర్ జిల్లాలోని ములకనూరు సహకార సొసైటీ పనితీరును పరిశీలించడానికి వెళ్లిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిపై దాడికి పూనుకోవడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉండవచ్చు. సీమాంధ్రకు చెందిన వాళ్లన్న పేరిట ఎవరినీ తెలంగాణలో తిరగనివ్వబోమనడం సమర్థనీయం కాదు. ఈరెండు సంఘటనల వెనుక రాజకీయ వ్యూహాలు ఉండి ఉండవచ్చు. కానీ, హైకోర్టులో జరిగిన సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.


ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వంటి పదవులలో 42 శాతం పోస్టులను, తెలంగాణ వారితోనే భర్తీ చేయాలని కోరు తూ తెలంగాణ న్యాయవాదులు ప్రారంభించిన ఉద్యమం శ్రుతి మించి న్యాయ వ్యవస్థనే ఆత్మ రక్షణలో పడవేసింది. ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోయిన పలువురు తెలంగాణ న్యాయవాదు లు, తాము దైవంగా భావించవలసిన కోర్టు హాళ్లలోకి జొరబడి, న్యాయమూర్తులను, సీమాంధ్ర న్యాయవాదులను బండబూతులు తిట్టడం ఎంతవరకు సమర్థనీయం!


మూడు రోజులపాటు హైకోర్టులో అరాచక పరిస్థితులు నెలకొన్నా, సెలవులో వెళ్లిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కక్రూ తిరిగి వచ్చి తగు ఆదేశాలు ఇచ్చే వరకు, పరిస్థితులను చక్కదిద్దడానికి ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మీనాకుమారి గానీ, ఇతర సీనియర్ న్యాయమూర్తులుగానీ ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? న్యాయవాదుల చర్యల వల్ల నష్టం ఎవరికి? ప్రభుత్వం పరిష్కరించవలసిన సమస్యను, హైకోర్టు ఆవరణలో, కోర్టు హాళ్లలో పరిష్కరించాలని కోరడంలోని ఔచిత్యం ఏమిటి? ఇలాంటి మరె న్నో ప్రశ్నలకు అటు తెలంగాణ న్యాయవాదులు, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన తెలంగాణ ఉద్యమ నాయకులు, ఇటు న్యాయమూర్తులు సమాధానం చెప్పవలసి ఉంది.


జరిగిన సంఘటనలకు మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి, శుక్రవారం నాడు రాజీనామాను ఉపసంహరించుకోవడానికి ససేమిరా అనడాన్ని గమనిస్తే, ఈ సంఘటనల వల్ల ఏర్పడిన గాయం ఇప్పట్లో మానుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. జస్టిస్ నాగార్జున రెడ్డి రేపోమాపో తన రాజీనామాను ఉపసంహరించుకోవచ్చు.


కానీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, రాగ ద్వేషాల కు తావులేని రీతిలో వ్యవహరించడం ద్వారా గౌరవం పొందవలసిన న్యాయమూర్తులనే, ప్రాంతాల వారీగా టార్గెట్ చేయడానికి వారి ప్రవర్తనే కారణమా? న్యాయవాదుల అరాచకం కారణ మా? ఏకంగా కోర్టు హాళ్లలోకే జొరబడి, న్యాయమూర్తులనే దూషించే ధైర్యం న్యాయవాదులకు ఎలా వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఈ సందేహాలకు ముందుగా సమాధానాలు అన్వేషించవలసి ఉంది.


వ్యవస్థలను కుప్పకూల్చుకుంటూ పోవడం వల్ల ఏమి జరుగుతుందో ఇప్పుడు మన హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులకు అర్థమై ఉంటుంది. తెలంగాణ న్యాయవాదులకూ ఈ సంగతి భవిష్యత్తులో తెలిసి వస్తుంది. న్యాయమూర్తులు న్యాయమూర్తులుగా కాకుండా, కుల, మత, ప్రాంతాల వారీగా విడిపోయి, రాజకీయ రంగు కూడా వేసుకోవడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇప్పుడున్న పరిస్థితులలో హైకోర్టు ఎలా పనిచేస్తున్న ది? ఆయా వ్యాజ్యాల్లో అనుకూల ఉత్తర్వులు రావడానికి న్యాయవాదులు చేసే వాదనలు మాత్రమే సరిపోతున్నా యా? వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.


న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఎప్పటి నుంచో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా ఇటీవలి కాలం లో పెరిగిపోయాయి. ఆదర్శంగా వ్యవహరించవలసిన న్యాయమూర్తులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు శాంపిల్‌గా మాత్రమే తెలిసింది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే ఘోరంగా ఉండబోతున్నాయి. కోర్టు హాళ్లలోకి చొచ్చుకు వచ్చి కోర్టుల పనిని అడ్డుకున్న న్యాయవాదులను నిలువరించలేని నిస్సహాయస్థితిలో జస్టిస్ మీనాకుమారి ఎందుకు ఉండిపోయారో ఆమె సమాధా నం చెప్పవలసి ఉంటుంది.


పదోన్నతుల ఆరాటం నుంచి న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాకపోవడం శోచనీ యం. ఇవ్వాళ జస్టిస్ నాగార్జునరెడ్డికి జరిగిన అవమానం, రేపు మరెవరికైనా జరగవచ్చు. అయితే, తమ ముందు అత్యంత వినయంగా 'మిలార్డ్' అంటూ సంబోధిస్తూ కేసులు వాదించే న్యాయవాదులకు, తమను దూషించే తెంపరితనం ఎందుకు వచ్చిందో ముందుగా న్యాయమూర్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన, నడవడికను బట్టి ఎదుటి వాళ్లు మనల్ని గౌరవిస్తారన్న నానుడి ఉండనే ఉంది.


ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో హైకోర్టు న్యాయమూర్తులకే కాదు; మొత్తం దేశంలోని న్యాయ వ్యవస్థకే తెలిసి వచ్చేలా ఈ సంఘటనలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పని తీరులో అవాంఛనీయ పోకడలకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. మనం ఎంతకాలం, ఏ పదవిలో ఉన్నామన్న విషయం కాదు. ఎంత ఆదర్శంగా విధులు నిర్వహించామన్నది ముఖ్యమన్న విషయాన్ని న్యాయమూర్తులకు గుర్తు చేయడం సాహసమే అవుతుంది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన న్యాయవాదులను నిలువరించే 'మోరల్ అథారిటీ' మన న్యాయమూర్తుల కు లేదా? ఉందో లేదో ఆయా న్యాయమూర్తులే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.


ఇక న్యాయవాదుల విషయానికి వద్దాం. న్యాయాధికారుల పోస్టుల్లో 42శాతం కోటా కావాలని తెలంగాణకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేయడంలో ఆక్షేపణ ఏమీ లేదు. జనాభాలో వాటా (ఫెయిర్ షేర్) ప్రాతిపదికగా తమకు పోస్టు లు కేటాయించాలని వారు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే. ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ కావాలని కూడా డిమాండ్ చేయవచ్చు. కానీ ఆ డిమాండ్ సాధనకు వారు ఎంచుకున్న మార్గమే అత్యంత అభ్యంతరకరమైనది.


42 శాతం పోస్టులు ఇవ్వాల్సింది ఎవరు? ఆందోళన ఎక్కడ జరిగింది? అన్నదే ఇక్కడ ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న, ఈ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. డిమాండ్ సాధనకు అనుసరించిన విధానం సమర్థనీయమేనా అని వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యాయవాదులకు మద్దతు ప్రకటించిన నాయకులు కూడా ఈ విషయంలో సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది.


తెలంగాణ ఏర్పా టు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని, న్యాయవాదుల డిమాండ్ ను వేర్వేరుగా చూడవలసి ఉంటుంది. లా ఆఫీసర్ల నియామకాల్లో 42 శాతం కోటా తెలంగాణ న్యాయవాదులకు దక్కకపోయి ఉండవచ్చు. అలా ఇప్పుడే జరిగిందా? ఇంతకు ముందు అన్యాయం జరగ లేదా? అనేది తేలవలసి ఉంది. ఇంతకు ముందు నుంచే ఈ పరిస్థితి ఉండి ఉంటే, ఇంత విధ్వంసకరంగా ఇప్పుడే ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఇంతకంటే ముఖ్యమైన అంశం, ఈ డిమాండ్‌ను పరిష్కరించవలసింది రాష్ట్ర ప్రభుత్వం.


హైకోర్టు చేయగలిగింది ఏమీ లేదు! పరిధిలో లేని అంశంపై హైకోర్టు ఆవరణలో విధ్వంసకాండకు పాల్పడే బదులు, సచివాలయంలోగానీ, ముఖ్యమంత్రి నివాస గృహం వద్ద గానీ, ధర్నాలు, దీక్షలకు దిగి ఉంటే ఆక్షేపించవలసింది ఏమీ ఉండదు. ఇందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించవలసి వచ్చిందో తెలంగాణ న్యాయవాదుల జె.ఎ. సి. నాయకులే చెప్పవలసి ఉంటుంది. తమ ఆవేదనను, ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాలని జె.ఎ.సి. నాయకులు చెబుతూ ఉండవచ్చు.


కానీ, సమాజంలో రోల్‌మోడల్‌గా వ్యవహరించ వలసిన న్యాయవాదులు, తమ ప్రవర్తన ద్వారా ప్రజల్లో గౌరవాన్ని పొందుతున్నారో, చులకన అవుతున్నారో ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న న్యాయవాదులే, ఆ రాష్ట్రంలో న్యాయమూర్తులుగా నియమితులు కావచ్చు. ఇవ్వాళ న్యాయమూర్తులను అవమానించిన వాళ్లు, రేపు న్యాయమూర్తులుగా నియమితులైతే, వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే? 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!' అని అప్పుడు న్యాయవాదులు ప్రశ్నిస్తే ఏమి సమాధా నం చెప్పగలరు? అలాగే గురువారం నాడు ఒక న్యాయవాది, తనపై పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.


చట్టరీత్యా ఇది నేరం. ఈ సంగతి న్యాయవాదులకు తెలియనిది కాదు. ఇవ్వాళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ న్యాయవాదే, రేపు ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానో, గవర్నమెంట్ ప్లీడర్‌గానో నియమితులు కావచ్చు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున ఆయన వాదించవలసి రావచ్చు. తాను చేసింది తప్పు కానప్పుడు, ఇతరులు చేసింది తప్పని వాదించే నైతికత ఆ న్యాయవాదికి ఉంటుందా? ఈ చర్యలన్నీ తాత్కాలిక ప్రయోజనాలను లేదా ప్రచారాన్ని తెచ్చిపెట్టవచ్చు.


కానీ, మహోన్నతమైన సంప్రదాయాలను, చట్టాలను మనమే ఉల్లంఘిస్తే, జరగబోయే పరిణామాలకు మనం కూడా బలవుతామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవలసి ఉంది. న్యాయం కోసం వచ్చే వారిని అక్కున చేర్చుకుని, న్యాయాన్ని అందివ్వవలసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమే, ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అటు న్యాయమూర్తుల కు, ఇటు న్యాయవాదులకు కూడా ప్రవర్తనా నియమావళి ఉంటుంది. ఎవరికి వారు దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది.


న్యాయ వ్యవస్థలో కూడా ప్రాంతీయ వైషమ్యాలు చొరబడ్డ తీరు చూస్తే ఎవరికైనా మనసు వికలం కాకమానదు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న నాయకులు, సంఘాల ప్రతినిధు లు, అటు సమైక్యాంధ్ర కావాలంటూ హడావుడి చేస్తున్న నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నారో స్పష్టం చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉండవచ్చు. లేదా రెండు రాష్ట్రాలు కావచ్చు. లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.


అది నాయకుల సమస్య మాత్రమే కాదు. ప్రజల సమస్య! రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం సరైన విధానం కాదు. దీనివల్ల అమాయక ప్రజలు నలిగిపోతారన్న వాస్తవాన్ని గుర్తించి, నాయకులు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకోవడం అత్యాశ కాకూడదు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లితే ఎవరికి మాత్రం సుఖం మిగులుతుంది?! సమస్య కానిది సమస్యగా మారకూడదు.


ఉద్యమ నాయకులకు గానీ, తెలంగాణ ఉద్యమ నేతలకు గానీ, సమైక్య వాదన వినిపించే నాయకులకు గానీ, ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అవుతాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఆ కారణంగానే సెంటిమెంట్ గ్రామ స్థాయి వరకు బలంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ ఏర్పడినా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులువు కాదన్న వాస్తవాన్ని ఉద్యమ నాయకులు గుర్తించి, ఇప్పటి తమ చర్యలు మున్ముందు తమకే ఎదురుకొట్టకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది.

2 comments:

Srikrishna Chintalapati said...

Superb Article Friend. I liked it to the core. Thanks for Sharing :)

Truely said...

Excellent Analysis... US did the same mistake with talibans.

I am sure this is all to keep telangana pot boiling. be ready to see more planed agitations one after other.

ఇప్పుడు సమయం ..