The Evils of Black Money on the Society :
ముందు ధియరీ కొంచెం చదవండి :
ముందు ధియరీ కొంచెం చదవండి :
నల్ల డబ్బు అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు అని చిన్న పిల్లాడికి సైతం అవగాహన ఉంది.కాని సరైన నిర్వచనం చెప్పాలంటే, ఆదాయపు / ఇతర పన్నులు కట్టని డబ్బు అని అర్ధం. మన దేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు లెక్క కట్టడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. గత కొన్ని దశాబ్దాలుగా తర తరాలుగా నల్ల డబ్బు కూడగట్టిన కుటుంబాలు కోకొల్లలు. పన్ను ఎగగొట్టడం ఒక కళగా సాధన చేస్తున్నవారు ప్రభుత్వానికి అంత సులభంగా దొరకరు. మన అధికారులు కూడా చిన్న చిన్న కానుకలు స్వీకరించి "పోనీలే పాపం" అని వాళ్ళని వదిలేస్తుంటారు.
మామూలు గా అందరూ సక్రమంగా సంపాదించి అక్రమంగా పన్ను ఎగవేస్తుంటారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది.. అభివృద్ది పనులు జరగవు.
అయితే ఈ నల్ల డబ్బు కి మరొక ప్రమాదకరమైన పార్శ్వం ఉంది. అదే చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన ధనం. ఈ రకమైన నల్ల డబ్బుచాలా ప్రమాదకరం. అది దేశ ఆర్ధిక వ్యవస్థనే కాకుండా పాలన వ్యవస్థని కూడా అస్థిర పరుస్తుంది. అంతే కాదు, ఆ డబ్బు మళ్ళీ చీకటి కార్య కలాపాలకు మళ్ళుతుంది. ఆ డబ్బుని నక్సలైట్స్, క్రిమినల్స్, ఇతర సంఘ వ్యతిరేక శక్తులు - తమ ఆయుధాలు సమకూర్చుకోవడానికి వాడే ఆవకాశం ఉంది. ఇంకా, రాజకీయ నాయకులు, వోట్ల కోసం నోట్లు పంచడానికి, కంట్రాక్టర్లు లంచాలు ఇవ్వడానికి వాడటం ఎలాగు ఉంటుంది.
ఇన్ని విధాలుగా మన వ్యవస్థ పై దుష్ప్రభావం చూపిస్తున్న ఈ మహమ్మారిని ఏమి చేయ్యలేమా? ఆదాయపు పన్ను శాఖ వాళ్లకి, ఇతర ప్రభుత్వ విభాగాలకి దీనిని అరికట్టే శక్తి లేదా - అని ప్రశ్నించుకుంటే ఉందనే జవాబు వస్తుంది. ఎన్నో చట్టాలు, పద్ధతులు ( procedures ), నిఘా వ్యవస్థలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. అవి సవ్యంగా పని చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ, మైనింగ్, లీగల్, సివిల్ కాంట్రాక్ట్, ఎక్సైజ్ మొదలైన వ్యవహారాల్లో నల్ల డబ్బు వాటా ఎక్కువ. కొద్దిపాటి జాగ్రత్త వహించి, కొంచెం నిజాయితీ చూపిస్తే, అధికారులు ఇలాంటి పన్ను ఎగవేత దారులని సులభంగా పట్టుకోవచ్చు. పాన్ నంబర్ గాని, మరేదైనా నంబర్ గాని తప్పనిసరిగా ప్రతి లావాదేవీలో వాడాలి అని ఉన్న నిబంధనని తు చ తప్పక పాటించాలి. భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తిగా కంప్యుటరైజ్ చెయ్యాలి. ఇలాంటి విషయాలలో ఎంత పారదర్శకత ఉంటె అంత తక్కువ అవినీతి, పన్ను ఎగవేత ఉంటాయి.
ఇక అసాంఘిక కార్యకలాపాలకు వాడే నల్ల డబ్బు పూర్తిగా భిన్నమైన దారిలో ప్రయాణిస్తుంది. వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాలకు రావడం, తమ వివరాలు ఇవ్వడం అనే సమస్య రాదు. హవాలా లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా లావాదేవీలు నడుస్తాయి. దీనిని అరికట్టడం ఆదాయపు పన్ను అధికారుల వల్ల అయ్యే పని కాదు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, నిజాయితీ కల అధికారులు, అప్రమత్తత ఉన్న పౌరులు ఇందుకు ఉపయోగ పడతారు.
ఇలా దాచిన డబ్బు చివరకు విదేశాల్లో తేలుతుంది, మన ఆర్ధిక వ్యవస్థకు శాపంగా పరిణమించిన ఈ సమస్య కు, ఆ దేశాల ప్రభుత్వాలు, బ్యాంకులతో అవగాహన కు రావడం కూడా అవసరం. కాని ఏ ప్రభుత్వం వచ్చినా తమ ఆస్తులు బయట పడతాయనే భయంతో ఇందుకు చిత్తశుద్ది తో ప్రయత్నించదు. చివరకు కోర్ట్ లు కలగా చేసుకోవాలి ఇందుకు కూడా !!
ఈ లింక్ చూడండి : నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే :
- మీరు దేశాన్ని ప్రేమించే వాళ్ళయితే నల్ల డబ్బు పోగు చెయ్యకండి
- మనం చెల్లించే ఆదాయపు పన్ను, ఇతర పన్నులు మన అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది అని మరిచిపోవద్దు.
- ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థ అనేది నేర మయమైన పునాదుల మీద నిర్మితమైంది - దానిని ప్రోత్సహించ వద్దు.
- రిజిస్ట్రేషన్ లాంటి వ్యవహారాలలో కొద్ది పాటి డబ్బు కలిసివస్తుందని అక్రమ పద్ధతులు అవలంబించకండి. లంచాలు ఇవ్వకండి. లంచం ఇవ్వమని ఎవరైనా అడిగితే అధికారులకు వాళ్ళని పట్టివ్వడానికి సహాయం చెయ్యండి.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే :
మేము ఒక్కళ్ళం నిజాయితీ గా ఉంటె, మేమే నష్ట పోతాం, మిగిలిన వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు అని చాలా మంది బాధ పడుతుంటారు. వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో ప్రభుత్వం ఆలోచించాలి. మన నిజాయితీ మనకి చేటు తెస్తోంది అని అనుకునే ప్రజలున్నారంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమే. నిజాయితీ కి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఉన్నాయని, అవినీతి, అక్రమాలకి శిక్ష తప్పదని నిరూపించేలా తగిన చర్యలు తీసుకోవాలి.
ఈమధ్య హైదరాబాద్ మునిసిపాలిటి పరిధిలో ఆస్తి పన్ను కట్టిన వాళ్ళలో ఒకరికి లాటరి తీసి లక్ష రూపాయల బహుమతి నిచ్చారని వచ్చిన వార్త చూసి నేను ఎంతో సంతోషించాను. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఉత్సాహ పరుస్తాయి.
పూర్తి వివరాలకు :
మరొక వైపు, అవినీతి అధికారుల పై ACB అధికారుల దాడి కి కులపు రంగు పులిమి ప్రభుత్వం, ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా కొట్టుకున్న సంఘటన కూడా ఈ వారంలోనే జరిగింది. కులాల ప్రాతిపదిక పైనే అవినీతిని కూడా కొలిచే ఇలాంటి నీచమైన నాయకులు మన మధ్య ఉండగా ఇంక ఏం మంచి పనులు ఆశించగలం?
ముగింపు : మంచి నాయకత్వం, మంచి ప్రజలు, మంచి వ్యవస్థ కలిస్తేనే అవినీతి రహిత అభివృద్ది సాధ్యం.