Tuesday, October 5, 2010

నోబెల్ బదులు.... నవ్వులపాలు!!

నేను ఎంతో ఆలోచించి నా బ్లాగ్ కి THINK DIFFERENT అని పేరు పెట్టాను.
కాని డిఫరెంట్ గా థింక్ చేస్తే మన దేశం లో ఎలాంటి మర్యాద దొరుకుతుందో ఈ రోజే తెలిసింది. 

ఈ క్లిప్పింగ్ చూడండి... 
(Courtesy : Andhra Jyothi Newspapaer dated 05.10.2010)
నిజానికి ఇది ఎప్పుడో జరిగిన కథ. నోబెల్ బహుమతి సాధించ డానికి అన్ని అర్హతలూ ఉన్న ఒక డాక్టర్ జీవితం ఎలా విషాదాంతం అయిందో చదివితే కళ్ళు చెమరుస్తాయి. 



 West Bengal లో కమ్యునిస్ట్ ప్రభుత్వం మూర్ఖపు నమ్మకాలకు ఊతమివ్వదని ఇన్నాళ్ళూ పొరబడ్డాను. ఎక్కడైనా నాయకులు అధికారులు ఇంతేనేమో!! 

డాక్టర్ ముఖోపాధ్యాయ కు సముచిత గుర్తింపు ఆయన బ్రతికుండగానే ఇచ్చి వుంటే ఆయన ఇంకా ఎంతో సాధించి మన దేశానికి పేరు తెచ్చి ఉండే వారేమో ! బహుశా నోబెల్ బహుమతి కూడా షేర్ చేసుకునే వారేమో!

>>అంధ్రజ్యోతి పూర్తి కధనం<<

మన 'బ్రహ్మ'కు మరణ శాసనం
రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ సృష్టికర్త భారతీయుడే

1978లోనే పరిశోధనలు
ముఖోపాధ్యాయ విజయాన్ని గుర్తించని బెంగాల్ ప్రభుత్వం
విచారణ పేరిట వేధింపులు
జపాన్ వెళ్లకుండా కేంద్రం అడ్డుపుల్ల
నిరాశా నిస్పృహలతో ముఖోపాధ్యాయ ఆత్మహత్య
ఆలస్యంగా లభించిన గుర్తింపు
ఈ ప్రపంచపు తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూసీ బ్రౌన్! పుట్టింది 1978 జూలై 25న, బ్రిటన్‌లో!
మరి రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
ఆ అమ్మాయి పేరు దుర్గ, పుట్టింది 1978 అక్టోబర్ 3న, కోల్‌కతాలో!
ఔను... ఇది నిజం!

బ్రిటన్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టిన 67 రోజులకే... భారత్‌లో రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టింది. కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ ఈ విజయం సాధించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన తాను సాధించిన విజయాన్ని ఎలుగెత్తి చాటారు.

కానీ... ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. పైగా.. ఆయనను వెలివేసినట్లుగా చూశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమూ ఆయన పరిశోధనను గౌరవించలేదు. భారత ప్రభుత్వమూ ఆయనను పట్టించుకోలేదు. చివరికి... తన పరిశోధన పత్రాలను జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రవేశపెట్టేందుకు వెళతానని నెత్తీ నోరూ బాదుకుని ప్రాధేయపడినా అనుమతి నిరాకరించారు.

దీంతో డాక్టర్ ముఖోపాధ్యాయ 1981 జూన్ 19న కోల్‌కతాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు! ఇదీ.. ఒక మహా శాస్త్రవేత్తకు మన దేశంలో లభించిన గౌరవం! ముఖోపాధ్యాయ విషాదాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా 'ఏక్ డాక్టర్‌కీ మౌత్' (ఒక వైద్యుడి మరణం) పేరిట సినిమా కూడా తీశారు.

బ్రిటన్‌లో డాక్టర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ స్టెప్టోయ్‌లు కృత్రిమ గర్భధారణపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే... భారత్‌లో ముఖోపాధ్యాయ ఇదే అంశంపై దృష్టి సారించారు. కృత్రిమ గర్భధారణ విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారానే 'దుర్గ' అలియాస్ కానూప్రియ అగర్వాల్ జన్మించింది.

అయితే... ముఖోపాధ్యాయ విజయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... ఐవీఎఫ్‌పై తదుపరి పరిశోధనలు చేయకుండా అడ్డుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి దీనిపై విచారణకు ఆదేశించింది. ఆధునిక పునరుత్పాదక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారెవరూ ఈ కమిటీలో లేరు. దీంతో... ఉపాధ్యాయుడిని ఒకటో తరగతి పిల్లాడు ప్రశ్నించినట్లుగా ఈ దర్యాప్తు తయారైంది.

ఈ పిండాలను మీరు ఎక్కడ పెట్టారు? యాంప్యూల్ (తొలి దశలో పిండాన్ని ఉంచే ట్యూబు)కు ఎలా సీలు వేశారు? సీలు వేసేటప్పుడు పిండం చనిపోదా? ఇలాంటి అవగాహనలేని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ముఖోపాధ్యాయ చెప్పిన సమాధానాలు వారి బుర్రకు ఎక్కలేదు. చివరికి... కృత్రిమ గర్భధారణలో విజయం సాధించానన్న ఆయన ప్రకటన ఉత్తి బోగస్ అని కమిటీ సభ్యులు తేల్చారు.

స్వదేశంలో ఎలాగూ గుర్తింపు లభించలేదు, కనీసం విదేశాలకైనా వెళ్లి తన పరిశోధన పత్రాలను సమర్పించాలని ముఖోపాధ్యాయ భావించారు. కానీ... కేంద్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. జపాన్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు... ఆయన సాధించిన విజయం కూడా సమాధి అయింది.

ఎలా బయటపడిందంటే...
1986 ఆగస్టు 16న పుట్టిన హర్షయే భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అని, ఐఆర్ఆర్ డైరెక్టర్ టి.సి.ఆనంద్ కుమార్ ఈ విజయం సాధించారని రికార్డుల్లో నమోదైంది. ఆనంద్ కుమార్ 1997లో 'సైన్స్ కాంగ్రెస్'లో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు కలిశారు. 'మీకంటే చాలా ముందే డాక్టర్ ముఖోపాధ్యాయ టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించారు.

ఈ పత్రాలు చూస్తే మీకే తెలుస్తుంది' అని ముఖోపాధ్యాయ రూపొందించిన పరిశోధన పత్రాలను ఆనంద్ కుమార్‌కు అప్పగించారు. ఈ పత్రాలను ఆనంద్ కుమార్ నిశితంగా పరిశీలించారు. భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించింది తాను కాదని, ఈ ఘనత ముఖోపాధ్యాయకే చెందుతుందని ఆయన తేల్చారు.

దీంతో ప్రభుత్వం కూడా రికార్డులు తిరగరాసింది. భారత తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ 'దుర్గ' అని, ఇది ముఖోపాధ్యాయ సాధించిన విజయమని నిర్ధారించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఆమె తనను సృష్టించింది ముఖోపాధ్యాయేనని మరోసారి ప్రకటించారు.

3 comments:

Anonymous said...

Anthe mari, manakepuudu Poruginti Pulla Koore baguntundi... Mana sathha manaku teleedu!

శిశిర said...

ఇంత కథుందా? ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకున్నారంటే బాధగా అనిపిస్తూంది. తన శ్రమనీ, పరిశోధనలనీ ఎవరూ గుర్తించడంలేదనే కుంగుబాటు ఎంతటి మేధావినైనా క్షణికావేశానికి లోను చేస్తుంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అయ్యో! ఎంత అన్యాయం!
బాధ అనిపిస్తూంది.

ఇప్పుడు సమయం ..