Monday, February 11, 2013

అక్కినేని విజయ రహస్యాలు


ఈ రోజు ఆంద్ర జ్యోతి లో వచ్చిన ఈ జ్ఞాపకాల దొంతర అక్కినేని జీవితంలో సాధించిన విజయాలకు కారణాలు విశదీకరిస్తుంది.....తప్పక చదవండి. 


మన శ్రమే మన తలరాత అంటారు



చదువుల బడిలో అక్షరాలు దిద్దకున్నా విశాల ప్రపంచాన్నే విశ్వవిద్యాలయంగా భావించి, అందులోనే తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న మహానటులు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్నో గౌరవ డాక్టరేట్లు, పద్మవిభూషణ్ లాంటి ప్రభుత్వ పురస్కారాలు, సినిమా రంగానికి చెందిన అత్యున్నతమైన దాదా ఫాల్కే పురస్కారం అందుకున్న ఆయన ఇంట్లో, పిల్లలతో ఎలా ఉండేవారు? మరో ఏడాదిలో 90 వసంతాలు చేరుకోనున్న ఆయన నుండి ఆయన పిల్లలు ఏం నేర్చుకున్నారు? వాటి గురించి ప్రముఖ సినీ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన పెద్దకుమారుడు అక్కినేని వెంకట్ చెప్పిన విశేషాలే ఈ వారం 'నాన్న-నేను'. 

"చిన్నప్పుడు చిక్కటి పెరుగు తాగే అలవాటు ఉండేది నాకు. గ్లాసుల కొద్దీ తాగేవాణ్ణి. దానికి తోడు బుగ్గలకు మెరుపొస్తుందని, చర్మం నిగనిగలాడుతుందని ఎవరైనా చెప్పారో లేక సొంత వైద్యమో తెలియదు కాని నాన్నగారు ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి...రెండు పూటలా వెన్నముద్దలను కప్పులో వేసుకుని తినేవారు. తను తినడమే కాదు నాక్కూడా తినిపించడం అలవాటు చేశారు. దీంతో మా ఇద్దరికీ చర్మానికి మెరుపు మాట అటుంచి వొంట్లో కొవ్వు పేరుకుపోయింది. అదే నాన్నగారికి గుండె జబ్బును తెచ్చిపెట్టింది. నాన్నగారికి మొదటిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడు నాకు 20 ఏళ్లు. ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. మా అమ్మ, మేము ఇక్కడే ఉండిపోయాం. నాన్నగారి వెంట పిఎపి అధినేత ఎ.వి. సుబ్బారావుగారు వెళ్లారు. "నాకేమీ కాదు..అమ్మను చూసుకుంటూ ఇక్కడే ఉండు'' అని నాకు చెప్పి నాన్నగారు బయల్దేరారు. డీలాపడిన అమ్మకు ధైర్యం చెప్పే బాధ్యత పెద్దకుమారుడిగా నేను తీసుకున్నాను.

అమెరికాలో కూడా అప్పుడే(1974) కొత్తగా ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్‌కు ముందు రోజు రాత్రి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి పేషెంట్‌కు సెడేటివ్స్(నిద్ర మాత్రలు) తప్పనిసరిగా ఇస్తారు. నాన్నగారికి కూడా ఒక అమెరికన్ నర్సు ఆ మాత్రలు చేతిలో పెట్టింది. "ఆపరేషన్ గురించి నేనేం భయపడడం లేదు. కాబట్టి హ్యాపీగా నిద్రపోతాను. ఈ మాత్రలు వేసుకోవలసిన అవసరం నాకు లేదు'' అంటూ వాటిని వేసుకోనంటూ నాన్నగారు భీష్మించుకు కూర్చున్నారు. వేసుకోనంత వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని ఆ నర్సు కూడా మొండికేసింది. దీంతో నాన్నగారు ఆ మాత్రలను నోట్లో వేసుకుని మింగకుండా దవడలో దాచేసి నీళ్లు తాగినట్లు నటించారు. నాన్నగారు మహానటులన్న విషయం తెలియని ఆ నర్సు నమ్మేసి తన మాట విన్నందుకు ఆనందిస్తూ వెళ్లిపోయింది. ఆమె అటు వెళ్లిన మరుక్షణం వాటిని ఊసేసారు ఆయన.

"ఆపరేషన్ చేసే డాక్టర్లకు భయం ఉండవచ్చేమో కాని నాకెందుకు భయం?'' అంటూ ఆయన «హాయిగా నిద్రపోయారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మూడు వారాల తర్వాత బయల్దేరి ఇండియా వచ్చేశారు. మొదటి నుంచి నాన్నగారికి ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెల్లంతో చేసే పిండి వంటలంటే చాలా ప్రీతి. ఆపరేషన్ తర్వాత ఆ ఇష్టాలన్నీ వదిలేసుకున్నారు. అంతకుముందు వరకు రోజుకు నాలుగైదు పెట్టెల సిగరెట్లను తాగేవారాయన. ఆ తర్వాత అటు వైపు చూస్తే ఒట్టు. ఆ రోజు నుంచి నేను కూడా పెరుగు, వెన్నకు గుడ్‌బై చెప్పేశాను.

నాన్నకు కోపమొస్తే...
నేను పుట్టింది మద్రాసులో. మూడవ తరగతి దాకా అక్కడే చదువుకున్నాను. నా ఎనిమిదవ ఏట 1960లో నాన్నగారు హైదరాబాద్‌కు తరలిరావడంతో మేమంతా కూడా ఇక్కడకు వచ్చేశాము. మేము ఐదుగురం సంతానం. పెద్దక్క సత్యవతి(దివంగతులయ్యారు). నేను రెండవవాణ్ణి. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు సుశీల, సరోజ. ఆఖరువాడు నాగార్జున. నాకు ఊహ వచ్చేసరికే నాన్నగారు పెద్ద హీరో. చాలా బిజీగా ఉండేవారు. రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఏ వారం పదిరోజులకో ఓసారి ఆయనను చూసేవాళ్లం. మేము లేచేసరికి ఆయన వెళ్లిపోయేవారు. ఆయన వచ్చేసరికి మేము నిద్రపోయేవాళ్లం. అయితే ప్రతి వేసవి సెలవులకు మాత్రం కొడైకెనాల్, ఊటీ.. ఇలా ఏదో ఒక హిల్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఓ పది రోజులు షూటింగ్ పెట్టుకునే వారు. మిగిలిన రోజులు షూటింగ్‌కు దూరంగా మాతోనే గడిపేవారు. అమ్మానాన్నలు ఎంత సరదాగా ఉంటారంటే హైదరాబాద్‌లో చూసే నాన్నేనా అని మాకు అనిపించేది. నిజం చెప్పాలంటే నాన్నగారితో గడిపే ఆ సెలవుల కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్లం. ఆ సెలవులు గడిచిపోతే ఆయనను చూసే అవకాశం మళ్లీ అలా ఎక్కడ దొరకదని దిగాలుపడేవాళ్లం.

నాన్నగారు ఇంట్లో ఉండడం తక్కువ కాబట్టి మా అల్లరికి అంతు ఉండేది కాదు. ఆయన ఇంటి పట్టున ఉన్న రోజున మా అమ్మగారు ఫిర్యాదుల చిట్టా ఇచ్చేది. దాంతో కొందరికి చీవాట్లు...మరి కొందరికి బడితపూజ...ఇలా ఎవరి కోటా వాళ్లకు అందచేసేవారు. చిన్నప్పుడు నాన్నగారితో మాకు సాన్నిహిత్యం చాలా తక్కువ కాబట్టి ఆయనంటే మాకు విపరీతమైన భయంగా ఉండేది. అయితే పెరిగే కొద్దీ ఆ భయం పోయింది. మేము చెప్పింది శ్రద్ధగా వినడం, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చేసేవారు. తాను పెద్దగా చదువుకోలేదు కాబట్టి పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నది నాన్నగారికి బలంగా ఉండేది. 1950వ దశకంలో నాన్నగారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ 45 వేలు ఉందట. అందులోనుంచే 25 వేల రూపాయలను ఆంధ్రా యూనివర్సిటీకి విరాళంగా అందచేశారంటే నాన్నగారికి చదువు పట్ల ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు.

రైతుబిడ్డగానే ఇప్పటికీ...
రైతు కుటుంబం నుంచి వచ్చిన నాన్నగారికి తోటలు పెంచడమన్నా, వ్యవసాయం చేయడమన్నా చాలా ఇష్టం.ముఖ్యంగా కూరగాయలు పండించడమంటే ఆయనకు ఎంతో ఆసక్తి. ఆయన ఇష్టాన్ని గమనించి, ఆయనకూ ఉపయోగకరంగా ఉంటుందని నేనే పాతికేళ్ల క్రితం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నాను. ఆ తోటలకు వెళ్లడం నాన్నగారు ఒక వ్యాపకంగా చేసుకున్నారు. తనకు ఇష్టమైన కూరగాయలను, పండ్లను ఆయనే పండించుకుంటారు. ఇంట్లో కూడా పెద్ద కూరగాయల తోటనే నాన్నగారు పండిస్తున్నారు. నాన్నగారికి పుస్తక పఠనమంటే కూడా చాలా ఇష్టం. అపారమైన జ్ఞాపకశక్తి ఆయనది. మహాకవి కాళిదాసు సాహిత్యం, పురాణాలు బాగా చదువుతారు. ఆ పద్యాలన్నీ ఆయనకు కంఠోపాఠమే. మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం మొదటి నుంచి లేదు. నాన్నగారు వృత్తినే దైవంగా భావించారు తప్ప ప్రత్యేకంగా పూజలు, దైవభక్తి లాంటివి ఆయనకు లేవు. నాదీ అదే పద్ధతి. మా ఇంట్లో మతపరమైన వేడుకలు, పండుగలు లాంటివి ఏవీ ప్రత్యేకంగా జరుపుకోము. పండుగలకు ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు ఏవీ మా ఇంట్లో ఉండవు. అలాగే గుళ్లు, గోపురాలను సందర్శించడం కూడా అరుదు. నాగార్జున మాత్రం 'అన్నమయ్య' సినిమా తర్వాత కొంత ఆధ్యాత్మిక చింతనలో పడ్డాడు.

స్థితప్రజ్ఞత
మా అమ్మగారు చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమెను కంటికి రెప్పలా నాన్నగారు చివరి క్షణం వరకు చూసుకున్నారు. మా అమ్మగారు మృత్యువుకు చేరువవుతున్నారన్న విషయం తెలిసినపుడు ఆయన కృంగిపోలేదు. గుండె నిబ్బరం చేసుకున్నారు. మేము దిగులు చెందుతుంటే ధైర్యం చెప్పే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. "ఏ క్షణంలో ఏమైనా కావచ్చు. మీ అమ్మ మనల్నందరినీ వదిలి వెళ్లిపోతోంది...మీరంతా నిబ్బరంగా ఉండాలి..తట్టుకుని నిలబడాలి'' అంటూ మమ్మల్ని ఓదార్చారు. మా అమ్మానాన్నలది దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన జీవిత భాగస్వామ్యం. అన్యోన్య దాంపత్యం. వారిద్దరు పరస్పరం కలహించుకోవడం నా జీవితంలో చూడలేదు. అమ్మంటే నాన్నగారికి అంతులేని ప్రేమ. అమ్మ దూరమైన బాధను ఆయన ఏనాడూ వ్యక్తం చేయలేదు. అమ్మ లేని లోటు తెలియకుండా ఉండేందుకు కాబోలు తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు.

ఇప్పటికీ నాన్నగారు క్షణం తీరికలేకుండా గడుపుతుంటారు. బోరు కొడుతోంది అన్న మాట ఆయన డిక్షనరీలోనే లేదు. నాన్నగారు మూఢనమ్మకాలకు పూర్తి వ్యతిరేకం. వాస్తు, జాతకాలు, ముహూర్తాలు లాంటివాటిని ఆయన నమ్మరు. మన కష్టమే మన తలరాత అని నమ్మే వ్యక్తి ఆయన. నిజాయితీ, నీతి, న్యాయం, ధర్మం...ఇవే నాన్నగారు పాటిస్తున్న సూత్రాలు. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలన్నది నాన్నగారి సిద్ధాంతం. అలా జీవించడం ఆయనకే సాధ్యమవుతోంది''.

నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించినప్పుడు నేను విదేశాలలో చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో నాన్నగారికి షూటింగ్‌లు చేసుకోవడానికి హైదరాబాద్‌లో స్టూడియో లేకుండా పోయింది. సారథి స్టూడియోస్ ఉన్నప్పటికీ అది నష్టాలలో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితిలో ఉండేది. ఆయన నటజీవితాన్ని కొనసాగించాలంటే బెంగుళూరుకో, మద్రాసుకో వెళ్లక తప్పదు. ఆ దశలో సొంతంగా తానే స్టూడియో నిర్మించాలన్న ఆలోచన నాన్నగారికి వచ్చింది. అప్పుడే నేను మద్రాసు లయోలా కాలేజ్‌లో బిఎ పూర్తి చేసి పైచదువుల కోసం విదేశాలకు వెళుతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌కు శంకుస్థాపన చేసిన రోజున ఉన్నాను...రెండేళ్ల తర్వాత నేను చదువు ముగించుకుని వచ్చేసరికి స్టూడియో రెండు ఫ్లోర్లు పూర్తయిపోలయింది. స్టూడియో నిర్మాణమంతా నాన్నగారు ఒంటి చేత్తో చేశారనే చెప్పవచ్చు. ఆ తర్వాత నాన్నగారి నుంచి ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను.

నాకు కాని, మా తమ్ముడు నాగార్జునకు కాని మొదటి నుంచి సినిమా రంగంపట్ల ఆసక్తి లేదు. మేము ఈ రంగంలోకి వస్తామని మేము ఏనాడూ ఊహించలేదు కూడా. ఒక దశలో అన్నపూర్ణ స్టూడియోస్ వరుస నష్టాలను అనుభవిస్తోంది. అప్పటికే నాన్నగారు సినిమాలు నిర్మించడం మానేశారు. స్టూడియో ఆర్థికంగా నిలబడాలంటే మేము సినిమాలు తీయక తప్పదని నిర్ణయించుకున్నాం. అలా నేను నిర్మాతగా, నాగార్జున నటుడిగా ఈ రంగంలోకి ప్రవేశించాము. నిర్మాతగానే కాక దర్శకత్వానికి సంబంధించి అన్ని రంగాలలో కూడా అనుభవం గడించాను. నాగార్జున నటించిన 'రక్షణ' చిత్రానికి నా పేరు వేసుకోకపోయినా దర్శకత్వం దాదాపు నేనే చేశాను. నా అభిరుచికి, ఆలోచనలకు అనుగుణంగా ఒక్క చిత్రానికి దర్శకత్వం చేయలేదన్న అసంతృప్తి ఇప్పటికీ నన్ను వేధిస్తోంది.

అజాత శత్రువు నాన్న
నాన్నగారికి చిత్రరంగంలో చాలా మంది మంచి మిత్రులు ఉండేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు నాన్నగారికి మార్గదర్శి అని చెప్పాలి. అలాగే నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారు, ఆయన సోదరుడు కృష్ణప్రసాద్‌గారు నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. మా అమ్మగారికి వరుసకు సోదరుడైన స్వర్గీయ కొడాలి వెంకటేశ్వరరావుగారు నాన్నగారికి అత్యంత ఆత్మీయులు. ఇక శివాజీగణేశన్‌గారు, నాన్నగారైతే చిన్ననాటి స్నేహితుల్లాగా 'ఏరా', 'ఒరేయ్' అని పిలుచుకునేవారు. శివాజీగారు హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా మా ఇంట్లో దిగాల్సిందే. అలాగే నాన్నగారు మద్రాసు వెళితే వాళ్లింటికే నేరుగా వెళ్లేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు, వి.బి.రాజేంద్రప్రసాద్‌గారి కుటుంబాలతో మా అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది.
టి.సుధాకర్ ఫోటో : రాజ్‌కుమార్
Thanks to : Andhra Jyothi Daily 

1 comment:

Unknown said...

Very informative. Though, I know many things about ANR, every article publised on him is interesting. He is such a Legend. I am very happy to have read this article...K V RAO.9885482942

ఇప్పుడు సమయం ..