Saturday, February 2, 2013

స్టైల్ (style) కూడా ఒక రకంగా స్వీయ భావ తస్కరణే !!




స్టైల్ (style) కూడా ఒక రకంగా స్వీయ భావ తస్కరణే !!

STYLE IS SELF PLAGIARISM !! 


ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్
చాలా మంది తమ తమ రంగాల్లో ఒకానొక సమయంలో  కొన్ని గొప్ప పనులు చేస్తారు.... కానీ అదే మూసలో కొట్టుకుపోతుంటారు. 

వాళ్ళు ఆ పాత సృజన కు ఎంతగా అతుక్కు పోతారంటే అదే పధ్ధతి (మూస), ఆలోచన  
ఎలాంటి కొత్త సమస్యలకైనా, సంఘటనలకైనా, సరిపోతుందని భావిస్తారు.

అంతేకాదు ఇకముందు అంతకంటే మెరుగైన సృజనాత్మకత లేదా ఆలోచన తమకు రాదని కూడా భయపడుతుంటారు. 

- ఈ మాటలన్నది ప్రఖ్యాత హాలివుడ్ దర్శకుడు "ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్".



Style is Self-Plagiarism.



Many people do something great at a given point in their careers and are forever influenced by that event,either thinking they have found the creative solution that works for all situations or fearful that they’ll never have such a big idea again.


- Alfred Hitchcock

ఆశ్చర్యం ... ఈ సిద్ధాంతం మన వాళ్ళ కు ఎంత అతికినట్టు సరిపోతుందో! 

కే. విశ్వనాధ్ - ఎంత గొప్ప దర్శకుడు? ఆయన తీసిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. 
దాసరి , రాఘవేంద్ర రావు,  బాపు - వీళ్ళు తెలుగు వారినే కాదు ఇతర భాషల ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్న ఉత్తమ చిత్రాలు తీశారు. 
రామ్ గోపాల్ వర్మ - ఒక తరం యువతరం అంతా ఆయన అభిమానులే ! శివ సినిమా ఒక్కటి చాలు కదా. 

ఇక విషయానికొస్తే, పైన చెప్పిన దర్శకులు అందరూ తమ తమ విజయవంతమైన, నిరూపితమైన ( proven ) శైలి (style) లో నుంచి బయటకు రాలేక అదే మూసలో సినిమాలు తీస్తూ వారిని అభిమానించే వారి చేతనే తిరస్కరణ కు గురవుతున్నారు. వీళ్ళు ఇప్పటికీ అంతే ప్రతిభావంతులు కానీ వారి ప్రయత్నాలు మనల్ని ఆకట్టుకోవడం లేదు ఎందుకంటే వారు వారి స్వంత మూసలోంచి బయటకు రాకపోవడమే. 

ఇలాంటప్పుడే థింక్ డిఫరెంట్  (ఈ బ్లాగు పేరు) అనే మాట పనికొస్తుంది. 

ఉదాహరణకు : విశ్వనాథ్ గారు " బిజినెస్ మెన్"  


దాసరి గారు " కేమెరమేన్ గంగ తో రాంబాబు" 


రాఘవేంద్ర రావు గారు " సీతమ్మ వాకిట్లో ..." 

రాంగోపాల్ వర్మ గారు " అలా మొదలైంది" 


బాపు గారు " రాజన్న" 

సినిమాలకు పనిచేసి ఉంటే ఎంత కొత్తరకంగా ఉండేవో ఊహించండి. 

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే వారి శైలి నుంచి వాళ్ళు బయట పడాలి,  మనం వాళ్ళ ప్రతిభ కొత్త తరహాలో చూడాలి. 

Sunday, January 20, 2013

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు లిపి -ద్వితీయ ఉత్తమ లిపి !!


 తెలుగు భాషాభిమానులకు చాలా సంతోషకరమైన వార్త 

తెలుగు భాష అభిమానులు అంతర్జాలంలో గాని బయట గాని ఎంతో ఉత్సాహంగా భాష అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సంతోషమే. కాని ఈ మధ్య కాలంలో తెలుగు లిపికి ఒక ముఖ్యమైన గుర్తింపు వచ్చిందనే విషయానికి తగిన ప్రచారం ఇవ్వలేదు అనిపిస్తోంది.

ఈనాడు వారి "తెలుగు వెలుగు" మాస పత్రిక తాజా సంచికలో వచ్చిన " అమ్మ సిగలో మరో కలికితురాయి " అనే కథనం ప్రకారం: 

ఇటీవల ( 2012 అక్టోబర్ 1 నుంచి 4 వరకు ) థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన "రెండవ ప్రపంచ లిపుల సదస్సు" లో మన తెలుగు లిపి "ద్వితీయ ఉత్తమ లిపి" గా ఎంపిక అయింది.  మొదటి స్థానం కొరియా భాషకు వచ్చింది.  

ముప్పై మూడు దేశాల నుంచి ప్రతినిధులు అనేక భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇందులో పాల్గొనగా మన తెలుగు భాష కు ప్రతినిధి గా మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ (డాక్టర్) మాడభూషి సంపత్ కుమార్ హాజరయ్యారు. 

మన లిపి కి ఈ పురస్కారం రావడానికి కారణాలు: 

  1. సౌకర్యవంతమైన లిపి.
  2. ఉచ్ఛారణ విధేయత 
  3. వీలైనన్ని ధ్వనులను రాయడానికి గల సామర్ధ్యం.
  4. నేర్చుకోవడం సులభం.
  5. అందమైన లిపి. 
ఐతే మనం మొదటి స్థానం సంపాదించక పోవడానికి కారణం " ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి అనుకూలంగా లేకపోవడం" అని, ఆ కారణంగానే కొరియా భాష మొదటి స్థానం సాధించింది అని అర్ధమవుతుంది. 

ఏది ఏమైనా ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ విషయాన్ని మనం తగినంత ప్రచారంతో ప్రజలలోకి తీసుకు వెళితే
కొత్త తరంలోని తెలుగు వారికి భాష నేర్చుకోవడానికి, రాయడానికి స్ఫూర్తి కలిగిస్తుందేమో.






ఈ లింకు చూడండి : 

http://rki.kbs.co.kr/english/news/news_zoom_detail.htm?No=6901

Thursday, January 17, 2013

చిరు తెలుగు మెగా ఇంగ్లీష్

చిరు తెలుగు మెగా ఇంగ్లీష్

ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో మన మెగా స్టార్ ఇలా మాట్లాడారని 
సాక్షి దినపత్రిక లో ఒక వార్త వచ్చింది. కాని సాక్షి వార్తలని నమ్మడం మంచిది కాదు.
ఎవరైనా ఈ ప్రసంగం విన్నారా? 



Tuesday, June 7, 2011

నిలువెత్తు నిర్లక్ష్యం



అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో 
మహనీయులకు మరొక సారి అవమానం


ఆందోళన కారుల చేతిలో పూర్తిగా ధ్వంసమైన విగ్రహాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. కనీసం ఆనవాలు లేకుండా నీటి పాలై, ఆ మహనీయుల పరువు నిలిపాయి. 


కాని, ఈ విగ్రహం అత్యంత హేయమైన, నీచమైన, అనాగరికమైన నిర్లక్ష్యానికి గురయ్యింది. మార్చ్ 10 వ తేదీ .. ఇదే విగ్రహం నడి రోడ్డు మీద పడిఉంది. ఆ తర్వాత రెండు రోజులు ట్యాంక్ బండ్ మధ్య మలుపు లో పేవ్ మెంట్ మీద (మెడ కు ఉరి తాడుతో సహా  అలాగే) గడిపడం నేను చూసాను.  ఆ తర్వాత కొన్ని దిన పత్రికల్లో వచ్చిన విమర్శలతో, ప్రభుత్వ అధికారులు ఈ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణానికి తరలించారు. అక్కడ ఈ ఫోటో లో ఉన్న స్థితి లో, మూత్ర శాలల నడుమ,  చాల రోజులనుంచి ఉన్నట్టు ఇది వరకే, ఇంకొక దిన పత్రికలో చదివాను. 

మనకు మహనీయుల విగ్రహాలు ఎందుకు? వారికి కనీస గౌరవం ఇవ్వలేని ప్రజలు, ప్రభుత్వాలు ఉన్నంత కాలం మన తెలుగు వెలుగుల గతి ఇంతే. ఇతర భాషల వాళ్ళు, వారి మహనీయులని ఇలాగే "గౌరవిస్తున్నారా"? 

మన సాంస్కృతిక శాఖ వారి పని తీరుకు మరొక్క సారి నా జోహార్లు.  దయ చేసి మళ్లీ కొత్త విగ్రహాలు చేయించి కొత్త అవమానాలు చేయకండి.


Friday, October 8, 2010

రోబో- నా సొంత రివ్యూ

 రోబో ఇప్పటికే ప్రపంచమంతా సంచలనాలు సృష్టిస్తోంది... కొత్తగా చెప్పడానికి ఏమి లేకుండా వ్యూలు,  రివ్యూలు వచ్చేశాయి.
కాని నా కంటితో చూసి నా సొంత రివ్యూ రాస్తే ఎలా వుంటుంది అనుకున్నా. అది ఇలా ఉంది.



రోబో కి స్వంత తెలివి, ఆలోచన, విచక్షణ, స్పందన, సందర్భోచిత ప్రవర్తన ఉండవు కాబట్టి అవి ఎన్నటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాలేవు... ఒక వేళ అటువంటి తెలివిని వాటిలో ప్రవేశ పెట్టినా ఆ ప్రయత్నం  వినాశనానికి దారి  తియ్యొచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పనిలో పనిగా మనుషుల్లో కూడా తెలివి వికటిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని దర్శకుడు కన్వే చేసాడు. తనను సృష్టించిన "దేవుడికి" ద్రోహం చెయ్యడానికి ఒక రోబో ప్రయత్నం, అందువల్ల కలిగిన విధ్వంసం, హీరో తన సృష్టిని తన నియంత్రణ లోకి ఎలా తెస్తాడు అనే విషయాలను దర్శకుడు తన ప్రతిభ, సాంకేతిక నిపుణుల సామర్ధ్యం, నటీనటుల నట పాటవం తో ఎంతో అందంగా భారీ గా తెరకి ఎక్కించాడు.

ఇంతకంటే వివరాలు మీకు చెప్పకుండా డైరెక్ట్ గా విషయానికొస్తే ...

రోబో మూవీ రజనికాంత్ తప్ప వేరొకరు చేస్తే ? సినిమాలో ఈ రకమైన ఫీల్ ఉండేది కాదు. ఇంత డిమాండ్ ప్రపంచమంతా ఉండేది కాదు. ఇంత ఖర్చుకు తగ్గ రాబడి పూర్తిగా అనుమానమే !! అందుకే,  ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్.
ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్
రెహ్మాన్ సంగీతం : అంత గొప్పగా లేదు. సినిమా స్థాయికి తగ్గ పాటలు, BG మ్యూజిక్ లేవు.

సాంకేతికంగా ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. భారతీయ సినిమాల స్టాండర్డ్ ప్రకారం ఇందులో చూపిన గ్రాఫిక్స్, టెక్నిక్, మిక్సింగ్ ఎంతో ఉన్నత స్థాయి లో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరింది.  కానీ Terminator  2 , I Robo లాంటి సినిమాలు చుసిన వాళ్లకు మనం ఇంకా చాలా వెనక బడినట్టు అనిపించడం సహజం.

మొత్తానికి రజని presence , హ్యూమన్ టచ్ , కళ్ళు మిరుమిట్లు కొలిపే గ్రాఫిక్స్ ఈ సినిమాని సూపర్ హిట్ చేసాయి.
Verdict : ఒక సారి చూడొచ్చు.

Tuesday, October 5, 2010

నోబెల్ బదులు.... నవ్వులపాలు!!

నేను ఎంతో ఆలోచించి నా బ్లాగ్ కి THINK DIFFERENT అని పేరు పెట్టాను.
కాని డిఫరెంట్ గా థింక్ చేస్తే మన దేశం లో ఎలాంటి మర్యాద దొరుకుతుందో ఈ రోజే తెలిసింది. 

ఈ క్లిప్పింగ్ చూడండి... 
(Courtesy : Andhra Jyothi Newspapaer dated 05.10.2010)
నిజానికి ఇది ఎప్పుడో జరిగిన కథ. నోబెల్ బహుమతి సాధించ డానికి అన్ని అర్హతలూ ఉన్న ఒక డాక్టర్ జీవితం ఎలా విషాదాంతం అయిందో చదివితే కళ్ళు చెమరుస్తాయి. 



 West Bengal లో కమ్యునిస్ట్ ప్రభుత్వం మూర్ఖపు నమ్మకాలకు ఊతమివ్వదని ఇన్నాళ్ళూ పొరబడ్డాను. ఎక్కడైనా నాయకులు అధికారులు ఇంతేనేమో!! 

డాక్టర్ ముఖోపాధ్యాయ కు సముచిత గుర్తింపు ఆయన బ్రతికుండగానే ఇచ్చి వుంటే ఆయన ఇంకా ఎంతో సాధించి మన దేశానికి పేరు తెచ్చి ఉండే వారేమో ! బహుశా నోబెల్ బహుమతి కూడా షేర్ చేసుకునే వారేమో!

>>అంధ్రజ్యోతి పూర్తి కధనం<<

మన 'బ్రహ్మ'కు మరణ శాసనం
రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ సృష్టికర్త భారతీయుడే

1978లోనే పరిశోధనలు
ముఖోపాధ్యాయ విజయాన్ని గుర్తించని బెంగాల్ ప్రభుత్వం
విచారణ పేరిట వేధింపులు
జపాన్ వెళ్లకుండా కేంద్రం అడ్డుపుల్ల
నిరాశా నిస్పృహలతో ముఖోపాధ్యాయ ఆత్మహత్య
ఆలస్యంగా లభించిన గుర్తింపు
ఈ ప్రపంచపు తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూసీ బ్రౌన్! పుట్టింది 1978 జూలై 25న, బ్రిటన్‌లో!
మరి రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
ఆ అమ్మాయి పేరు దుర్గ, పుట్టింది 1978 అక్టోబర్ 3న, కోల్‌కతాలో!
ఔను... ఇది నిజం!

బ్రిటన్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టిన 67 రోజులకే... భారత్‌లో రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టింది. కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ ఈ విజయం సాధించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన తాను సాధించిన విజయాన్ని ఎలుగెత్తి చాటారు.

కానీ... ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. పైగా.. ఆయనను వెలివేసినట్లుగా చూశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమూ ఆయన పరిశోధనను గౌరవించలేదు. భారత ప్రభుత్వమూ ఆయనను పట్టించుకోలేదు. చివరికి... తన పరిశోధన పత్రాలను జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రవేశపెట్టేందుకు వెళతానని నెత్తీ నోరూ బాదుకుని ప్రాధేయపడినా అనుమతి నిరాకరించారు.

దీంతో డాక్టర్ ముఖోపాధ్యాయ 1981 జూన్ 19న కోల్‌కతాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు! ఇదీ.. ఒక మహా శాస్త్రవేత్తకు మన దేశంలో లభించిన గౌరవం! ముఖోపాధ్యాయ విషాదాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా 'ఏక్ డాక్టర్‌కీ మౌత్' (ఒక వైద్యుడి మరణం) పేరిట సినిమా కూడా తీశారు.

బ్రిటన్‌లో డాక్టర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ స్టెప్టోయ్‌లు కృత్రిమ గర్భధారణపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే... భారత్‌లో ముఖోపాధ్యాయ ఇదే అంశంపై దృష్టి సారించారు. కృత్రిమ గర్భధారణ విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారానే 'దుర్గ' అలియాస్ కానూప్రియ అగర్వాల్ జన్మించింది.

అయితే... ముఖోపాధ్యాయ విజయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... ఐవీఎఫ్‌పై తదుపరి పరిశోధనలు చేయకుండా అడ్డుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి దీనిపై విచారణకు ఆదేశించింది. ఆధునిక పునరుత్పాదక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారెవరూ ఈ కమిటీలో లేరు. దీంతో... ఉపాధ్యాయుడిని ఒకటో తరగతి పిల్లాడు ప్రశ్నించినట్లుగా ఈ దర్యాప్తు తయారైంది.

ఈ పిండాలను మీరు ఎక్కడ పెట్టారు? యాంప్యూల్ (తొలి దశలో పిండాన్ని ఉంచే ట్యూబు)కు ఎలా సీలు వేశారు? సీలు వేసేటప్పుడు పిండం చనిపోదా? ఇలాంటి అవగాహనలేని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ముఖోపాధ్యాయ చెప్పిన సమాధానాలు వారి బుర్రకు ఎక్కలేదు. చివరికి... కృత్రిమ గర్భధారణలో విజయం సాధించానన్న ఆయన ప్రకటన ఉత్తి బోగస్ అని కమిటీ సభ్యులు తేల్చారు.

స్వదేశంలో ఎలాగూ గుర్తింపు లభించలేదు, కనీసం విదేశాలకైనా వెళ్లి తన పరిశోధన పత్రాలను సమర్పించాలని ముఖోపాధ్యాయ భావించారు. కానీ... కేంద్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. జపాన్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు... ఆయన సాధించిన విజయం కూడా సమాధి అయింది.

ఎలా బయటపడిందంటే...
1986 ఆగస్టు 16న పుట్టిన హర్షయే భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అని, ఐఆర్ఆర్ డైరెక్టర్ టి.సి.ఆనంద్ కుమార్ ఈ విజయం సాధించారని రికార్డుల్లో నమోదైంది. ఆనంద్ కుమార్ 1997లో 'సైన్స్ కాంగ్రెస్'లో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు కలిశారు. 'మీకంటే చాలా ముందే డాక్టర్ ముఖోపాధ్యాయ టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించారు.

ఈ పత్రాలు చూస్తే మీకే తెలుస్తుంది' అని ముఖోపాధ్యాయ రూపొందించిన పరిశోధన పత్రాలను ఆనంద్ కుమార్‌కు అప్పగించారు. ఈ పత్రాలను ఆనంద్ కుమార్ నిశితంగా పరిశీలించారు. భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించింది తాను కాదని, ఈ ఘనత ముఖోపాధ్యాయకే చెందుతుందని ఆయన తేల్చారు.

దీంతో ప్రభుత్వం కూడా రికార్డులు తిరగరాసింది. భారత తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ 'దుర్గ' అని, ఇది ముఖోపాధ్యాయ సాధించిన విజయమని నిర్ధారించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఆమె తనను సృష్టించింది ముఖోపాధ్యాయేనని మరోసారి ప్రకటించారు.

ఇప్పుడు సమయం ..